...

...

12, జూన్ 2017, సోమవారం

నారాయణ స్మృతి

నేను హైదరాబాదుకు 1987 చివరలో వచ్చాను. మధ్యలో ఉద్యోగార్థం బయట గడిపిన ఐదారేళ్ళు మినహాయిస్తే ఈ పాతికేళ్ళ నా హైదరాబాదు జీవితంలో డా.సి.నారాయణరెడ్డిని కొన్ని వందల సార్లు చూసి ఉంటాను. అది రవీంద్రభారతి అయినా, ఆంధ్ర సారస్వత పరిషత్తు అయినా, శ్రీకృష్ణదేవరాయాంద్రభాషా నిలయమైనా, త్యాగరాయ గానసభ అయినా, సిటీ సెంట్రల్ లైబ్రరీ అయినా, మహాసభ అయినా, చిన్న సభ అయినా ఆయనను అనేక సందర్భాలలో చాలా దగ్గరగా, దూరంగా చూశాను. ఆయన ఉపన్యాసం విన్నాను. చతురోక్తులు ఆస్వాదించాను. అయితే ఆ పెద్దాయనను పలకరించిన పాపాన పోలేదు. నేను రావూరి భరద్వాజతో మాట్లాడాను, మునిపల్లె రాజుతో ముచ్చటించాను, పోతుకూచి సాంబశివరావును పలకరించాను, అద్దేపల్లి రామమోహనరావుతో ఆప్యాయంగా మాట్లాడాను కానీ సినారెతో మాటలు కలపలేకపోయాను. కారణం మరేమీ కాదు బిడియమే. ఇలా పరిచయం చేసుకునే అవకాశం వుండీ పలకరించని వాళ్ళ జాబితా చాలానే వుందనుకొండి.   ఒకసారి సారస్వత పరిషత్ హాల్లో నా కథాజగత్తో, విద్వాన్ విశ్వమో పుస్తకం ఆయనకు ఇచ్చాను. దాన్ని ఆయన చదివారో లేదో తెలియదు. అభిప్రాయం ఏమీ వ్రాయలేదు. నేనూ ఆశించలేదు. మరో సారి మిత్రుడు ఎస్.డి.వి.అజీజ్ తో కలిసి ఆయన ఛేంబర్‌లో బుడ్డా వెంగళరెడ్డి పుస్తకం ఇచ్చి (దాని పబ్లిషర్ నేనే) ఒక అరగంటో గంటో ముఖాముఖీ గడిపాము. అప్పుడు కూడా వారితో మాట్లాడలేక పోయాను. వారితో కలిసి ఫొటో దిగాలన్న కోరికా కలగలేదు, అవకాశమూ దక్కలేదు. ఇప్పుడు ఎన్ననుకుంటే ఏం లాభం? మా యిద్దరి మధ్యనున్న అనుబంధం మాటలకతీతమైనది కాబట్టే మాట్లాడుకోలేక  పోయామేమో? అలా సరిపెట్టుకోవాలి ప్రస్తుతానికి.         

కామెంట్‌లు లేవు: