...

...

15, మే 2012, మంగళవారం

టి.శ్రీరంగస్వామిగారి పరిశీలన!

ఓరుగల్లు నుండి వెలువడుతున్న ఏకైక సాహిత్య మాసపత్రిక ప్రసారిక మే 2012 సంచికలో "సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం" గ్రంథాన్ని డా.టి.శ్రీరంగస్వామి గారు సమీక్షించారు. ఆ వ్యాసం పూర్తి పాఠం యథాతథంగా ఇక్కడ చదవండి.
         విద్వాన్ విశ్వం అనగానే మనకు తొలుతగా గుర్తుకువచ్చేది" పెన్నేటిపాట " . ఈ కావ్యంతో ఆయన పెన్నానది పరీవాహక ప్రాంతంలోని వెతలతోపాటుగా, రాయలసీమ బతుకునే పుటలకెక్కించారు. విద్వాన్ విశ్వం గారు ఆంధ్రప్రభ పత్రికలో సంపాదకులుగా పని చేసారు. బహుముఖ ప్రజ్ఞాశాలురు, కేవలం ఆంధ్రప్రభకు మాత్రమె  కాకుండా ఆయన మీజాన్, ప్రజాశక్తి, నవ్య సాహితీ పక్షపత్రిక, ఆంధ్రదిన పత్రిక, ఆంధ్రజ్యోతి మొదలగు పత్రికలకు సంపాదకులుగా పని చేసినారు. విశ్వంగారు కావ్యాలు, కథలు, విమర్శ, సమీక్ష, అనువాదాలు, ఇలా అనేకములు అందించినారు. చిలుకూరి నారాయణరావు గారికి 'విరికన్నె'కావ్యమును'1935 లో అంకితము ఇచ్చినారు. రాతలూ-గీతలూ; పాపం; నాహృదయం; పెన్నేటిపాట ; ఒకనాడు; మొదలగుక్రుతులను అందించినారు. చెకోవ్,రోమారోలా, ఇబ్సన్, బెర్నార్డ్ షా, ఓప్లే హార్డీ, పామీదత్తుల సాహిత్యమును తెలుగులోకి అందించినారు. వేదములను, ఋగ్మంత్రములను కూడా తెలుగులోకి అనువదించినారు. విశ్వంగారు పత్రికలలో నిర్వహించిన శేర్శికలు మాణిక్యవీణ, తెలుపు-నలుపు విశ్వంగారి నిశిత చూపుకు ప్రతిబింబాలుగా నిలుస్తాయి.  
              బహుముఖ ప్రజ్ఞావంతులైన శ్రీమాన్ విశ్వంగారికి రావలసిన పేరు రాలేదేమోననిపిస్తుంది. అలాగే దేవులపల్లి రామానుజరావు గారికి కూడా వర్తిస్తుంది అనిపిస్తుంది. పి.వి.నరసింహారావు గారు రాజకీయాలలోకి వెళ్ళడం వలన ఆయన లోని సాహిత్యకారుడు ప్రజల మనస్సులలో మరుగున పడిపోయాడనిపిస్తుంది. విద్వాన్ విశ్వం(21 -10 -1915 - 20 -10 -1987) 72 ఏళ్ళవయసులో  కనుమరుగు అయిపోయారు. మరో పాతిక  సంవత్సరాల తరవాత విద్వాన్ విశ్వంగారి గురించి తెలుసుకొనే నిమిత్తం, భావి సాహిత్యకారులకు ఆయన సాహిత్యమును, ఆయన పాండిత్య ప్రకర్షను పరిచయం చేసే నిమిత్తం సంపాదకులు "సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం" పేరుతొ ఈ పుస్తకాన్ని అందించినారు. ఈ గ్రంధాన్ని నాలుగు భాగాలుగా విభజించినారు. విశ్వజీవి (విశ్వం గారిపై వచ్చిన వ్యాసాలను); విశ్వరూపి (విశ్వం గారు నిర్వహించిన శీర్షికలు, కొన్ని వ్యాసాలు); విశ్వభావి (పీఠికలు,సమీక్షలు);విశ్వమేవ(సందేశాలు,ఇంటర్వ్యూలు)చేర్చారు.                                                                         
          విశ్వం గారి గురించి తెలుసుకోనేవారికి ఇవి బాగా వుపయోగపడుతవి. 1915 సంవత్సరం  వారి శత జయంతి సంవత్సరం. అప్పటికి తెలుగు సాహిత్యరంగం, ఆయన అభిమానులు, రాయలసీమ సాహితి బృందం ఆయన రచనలనన్నిటిని వెలుగులోనికి తెస్తే  ఆయనను మనం చిరంజీవిని చేసినవారము అవుతాము. ఒక జీవత్ కృతిని వెలువరించిన సంపాదకులకు నా అభినందనలు అందచేస్తున్నాను.    

కామెంట్‌లు లేవు: