...

...

5, మార్చి 2012, సోమవారం

విశాలాంధ్రలో సమీక్ష!

విశాలాంధ్ర దినపత్రిక ఈరోజు(05-03-2012) సాహిత్యం పేజీలో మేము ప్రచురించిన సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం పుస్తకంపై జానమద్ది హనుమచ్ఛాస్త్రిగారి సమీక్ష ప్రచురింపబడింది. 



సమీక్ష పూర్తి పాఠం ఇదిగో - 



సంపాదకులు: డా.నాగసూరి వేణుగోపాల్‌, కోడిహళ్ళి మురళీ మోహన్‌. ప్రచురణ అబ్జ క్రియేషన్స్‌, సాహితీ సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్‌. ప్రతులకు కోడిహళ్లి మురళీమోహన్‌ -9111-బ్లాక్‌ 9ఎ జనప్రియమహానగర్‌, మీర్‌పేట, హైదరాబాద్‌ -97. వెల రూ.200/- ఫోన్: 9701371256


విజయనగరసామ్రాజ్యంలో భాగంగా వెలిగినది రాయలసీమ. ఈ సీమలో జన్మించిన కవి పండితులకు, పరిశోధకులకు, పాత్రికేయులకు, వారి ప్రజ్ఞాపాటవాలకు సముచితమైన గుర్తింపు లభించలేదు. ఆ లోటును కొంతవరకైనా తీర్చుటకు చేసిన ప్రయత్నఫలితమే ఈ గ్రంథం...


ఆధునిక రాయలసీమ వాఙ్మయచరిత్రలో బహుముఖ ప్రజ్ఞానిధిగా వెలిగిన విద్వాన్‌ విశ్వంగారి విరాట్‌ స్వరూపాన్ని, కొంతలో కొంత వారి జీవన, రచనా రీతులను నాలుగు అధ్యాయాలుగా విభజించి రచించారు సంపాదక మిత్రులు డా.నాగసూరివేణుగోపాల్‌, కోడిహళ్లి మురళీమోహన్‌.... విభిన్న భావాలు కల ఇరువది మంది కవి, పండిత, రచయితలు, విద్వాన్‌ విశ్వంగారి రచనల గురించి, వారి వ్యక్తిత్వ విశేషాలను గురించి చెప్పిన అభిప్రాయాల సమాహారమే ఈసాహితీ విరూపాక్షుడు. విద్వాన్‌ విశ్వంగా తెలుగుపాఠకులకు సుపరిచితులైన విశ్వరూపాచారి అనంతపురం జిల్లా తరిమెలగ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో 1915లో జన్మించారు. కొంతకాలం పండితుల వద్ద కావ్య నాటకాదులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లములపై మంచి పట్టు సాధించారు.


దివాకర్ల వెంకటావధాని, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, తిరుమల రామచంద్ర, వేలూరి శివరామశాస్త్రి, విశ్వనాథ, ఆరుద్ర, మహీధరరామమోహనరావు, అద్దేపల్లి రామ్మోహనరావు మొదలగు వారు విశ్వంగారి రచనలపై వివిధ కోణాలలో చిత్రించారు. విశ్వంగారు కావ్యాలు నిర్మించారు. కథలు కల్పించారు. విమర్శలు వెలయించారు, సమీక్షలు సంకరించారు. సంస్కృతం నుండి పాశ్చాత్య భాషల నుండి అసంఖ్యాకంగా, రచనలను అనువదించారు. 1938లో, నవ్యసాహిత్యమాల అనే ప్రచురణ సంస్థ ద్వారా పలురచనలు ముద్రించారు. వారి రచనలన్నిటిలో మేరుశిఖరం, వారి పెన్నేటిపాట! రాళ్ళపల్లి వారు 'పెన్నేటి పాట'కు రాసిన ముందుమాటలో వారిది మానవ హృదయము. ఊహకన్న అనుభవమే మూలాధారంగా వెడలిన పరవశ రచన వీరి పెన్నేపాట! అని విశ్లేషించారు. నేటి రాయలసీమ కన్నీటిపాట. ఈ కావ్యంలో విశ్వంగారి కవితావిరూపాక్షుడు తాండవించినాడని, భాష, అర్థం, భావం ఛందస్సు అన్నీ ఆ తాండవానికి పక్కవాద్యాలుగా వాయించామని శర్మగారు వ్యాఖ్యానించినారు. ఈ కావ్యాన్ని మొదట అచ్చువేయించిన వారు తెలంగాణ రచయితల సంఘం:


విశ్వం రాసిన ''ఒకనాడు'' కావ్యేతివృత్త 1893 అక్టోబరు 4న జరిగిన ఒక వాస్తవ సంఘటన. బ్రిటిష్‌ సైనికుల మానభంగం నుండి ఇద్దరు హిందూమహిళలను రక్షించడానికి రైలుగేటు కాపలాదారు గూళపాలెం హంపన్న ప్రాణాలర్పించిన రోజు అది. చదివిన వారు కన్నీరు కారుస్తూ, హంపన్నకు నివాళులర్పిస్తారు. ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదకులుగా, 'మాణిక్యవీణ' మీటుతూ రాసిన వ్యాసాలు విశ్వంగారి అపారమైన లోకానుశీలనకు అద్దం పట్టినాయి. ఉద్దండపండితులైనీవేలూరి శివరామశాస్త్రి విశ్వంగారి అంతరంగాన్ని తమ వ్యాసంలో ఆవిష్కరించినారు. మహీధర రామమోహనరావు విశ్వంగారు సమకాలీన రాజకీయ నాయకుల చిత్తవృత్తిని ఎత్తి చూపినారు. నాగసూరి వేణుగోపాల్‌ విశ్వంగారి కుటుంబ జీవితం తెలుగు పాత్రికేయులకు స్ఫూర్తి దాయకమన్నారు.


తెలుపు-నలుపు వ్యాసాలలో కొందరు సమకాలీన రచయితల కృతులను రసహృదయులై విశ్లేషించారు. అడవి బాపిరాజు పరవశించి నాట్యం చేస్తూ పాడిన "ఉప్పొంగి పోయింది గోదావరీ తాను" అనే పాటలోని హృదయాన్ని సజీవంగా కట్టెదుట నిల్పినారు. 'మాణిక్యవీణ' లో బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర సమరానికి అందరూ సహకరించాలన్నారు. రాయలసీమ కరువు కాటకాలకు చిక్కి ప్రాణాలు కోల్పోయిన వైనాన్ని చూపి పాఠకులను 'అయ్యో' అని విలపింపచేశారు. మహామహోపాధ్యాయ, చిలుకూరి నారాయణ రావుగారి భాషాశాస్త్ర విజ్ఞానం తెలుసుకొని, వాడుక భాషలో గొప్పరచనలు రాయవచ్చునని నిరూపించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని రాజాజీ, ప్రకాశం, గిరి గార్లతో, మిత్రుడు తరిమెలనాగిరెడ్డితోపాటు గడపిన జైలు జీవితాన్ని తెలిపారు.


ఈ పుస్తకంలో "జీవితంలోంచి కొత్త కవుల ప్రభవం" శీర్షికలో, విద్వాన్‌విశ్వం- శ్రీశ్రీలు జరిపిన ముఖాముఖి తప్పక చదవాల్సిందే.


-జానమద్ది హనుమచ్ఛాస్త్రి  


కామెంట్‌లు లేవు: