...

...

18, మే 2011, బుధవారం

అస్తిత్వాలు - మార్క్సిజం

            అస్తిత్వాలంటే - సాంఘిక జీవి అయిన మనిషికి ఉండే గుర్తింపులు. పీడిత అస్తిత్వాలకు తమదైన సంస్కృతి ఉంటుంది. ఆర్థిక పాశ్వం కూడా ఉంటుంది. ఇవన్నీ వాస్తవికమైనవి, సంఘటితమైనవి. కాబట్టి వాటికి సంబంధించిన అనుభవంలో ప్రత్యేకతలుంటాయి. కులాలు, ప్రాంతాలు, మత మైనారిటీలు, జండర్ మొదలైన వాటి గురించి ఇప్పుడు లోతైన చర్చ నడుస్తున్నది. అస్తిత్వ స్పృహ నుంచి సమాజాన్నీ, జీవితాన్నీ, సాహిత్యాన్నీ చూపే కొత్త దృక్కోణాలు ఆవిష్కారమయ్యాయి. అనేక కారణాల వల్ల అణచివేతకు గురై, గుర్తింపుకు నోచుకోని అస్తిత్వాలు తమదైన సొంత వాదనతో ముందుకువచ్చాయి. ఒక ప్రత్యేకమైన అనుభవానికి ఉండే సామాజిక అర్థాన్ని వినిపిస్తున్నాయి. చరిత్ర, సంస్కృతి, సాహిత్యాల మీద కొత్త వ్యాఖ్యానాలు అందిస్తున్నాయి.

          అందువల్ల అనుభవం అనేదాన్ని ఇంతకు ముందుకంటే పూర్తి భిన్నంగా చూడాల్సిందే. అసలు సాంఘిక వాస్తవికతనే సరి కొత్తగా చూడాలి. అస్తిత్వ ప్రత్యేకల వల్ల నన్ను నేను ఎలా గుర్తిస్తున్నాను? సమాజం నన్ను ఎలా గుర్తిస్తుంది? ఇతరులను నేను ఎలా గుర్తిస్తాను? అనే ప్రశ్నలు ముందుకు వచ్చాయి. ఇవి అనుభవం నుంచి వస్తున్నవే అయీఅ వాటికి కారణమైన సాంఘిక వ్య్వస్థల చర్చ ప్రధానం కావాలి. అంటే - అస్తిత్వాల చర్చ సిద్ధాంతపరమైనదని అర్థమౌతుంది. 

                అన్ని సామాజిక శ్రేణుల్లో అస్తిత్వ స్పృహ కలగడంతో ఉద్యమాల్లో కూడా సహజంగానే కొత్త వాతావరణం తలెత్తింది. ఇది చాలా ఆలోచనాత్మకంగా సాగుతోంది. తీవ్ర సంఘర్షణ నడుస్తోంది. ఇన్ని రకాల అస్తిత్వాలున్నాయనీ, వాటితో రాజకీయంగా వ్యవహరించాలనీ అన్న విషయాల్లో ఇప్పుడెవరికీ సందేహం లేదు. కానీ ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా వ్యవహరించాలి? అనే విషయాల్లోనే సమస్య ఉన్నది.

            భిన్న అస్తిత్వవాదాలు ఏం చెబుతున్నాయి? అనేదాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే మొత్తంగా మార్పును కేంద్రం చేసుకున్న చారిత్రక భౌతికవాద పద్ధతిలో అస్తిత్వాలను ఎలా విశ్లేషించాలనేది చాలా ముఖ్యం. నిర్ధిష్టంగా మనదేశంలో, తెలుగు సమాజంలో అస్తిత్వ ప్రేరణతో సాగుతున్న సాంఘిక ఉద్యమాలు వలసవాదం నుంచి పుట్టిన ఆధునికత మీది విమర్శగా బయల్దేరాయి. ఆధునిక పూర్వ బంధనాల నుంచి మానవ జీవితాన్ని విడుదల చేయడంలో ఆధునిక వ్యవస్థలుగా చెలామణి అవుతున్నవన్నీ విఫలమయ్యాయనే నిరసన నుంచి అస్తిత్వవాదాలు, సాంఘిక ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. 

        రాజకీయంగా ఇవి వర్గపోరాటానికి, సాంఘిక ఉద్యమాలకు సంబంధించిన అనేక సమస్యలను ముందుకు తెస్తాయి. ప్రస్తుతం అలాంటి సంక్లిష్టత నెలకొని ఉన్నది. 

                ఆంధ్రప్రదేశ్‌లో విప్లవోద్యమం దున్నేవారికే భూమి అనే నినాదంతో బయల్దేరి ఆర్థిక, సాంఘిక పోరాటంగా సాగింది. అనేక సాంఘిక సమస్యలపై విశాల ప్రజానీకాన్ని విప్లవంలోకి నడిపించిన చరిత్ర ఉన్నది. విప్లవోద్యమం చేపట్టిన ఆర్థిక రాజకీయ పోరాటాలు అనివార్యంగా కుటుంబ హింస, అగ్రకుల ఆధిక్యం అనే సాంఘిక అణచివేతలను వెలుగులోకి తీసుకొచ్చాయి. వాటి మీద పెద్ద ఎత్తున పోరాటాలు పెల్లుబికాయి. భూస్వామ్యం బలంగా ఉన్న కాలంలో, ప్రాంతంలో ఆర్థిక - సాంఘిక వ్యవస్థలు ఎంత పెనవేసుకొని ఉంటాయో తెలంగాణా విప్లవ సాహిత్యంలో మనకు కనిపిస్తుంది. విప్లవోద్యమం ఆచరణలో గడించిన అనుభవానికీ సాంస్కృతిక వ్యాఖ్యాత అయిన విరసం ఈ జీవన పోరాట వాస్తవికను తొలి నుంచీ చిత్రిస్తూ వచ్చింది. అస్తిత్వ వాదాలు, వాటి వెలుగులో సాంఘిక పోరాటాలు రంగం మీదకి వచ్చాక ఈ చర్చ, సంఘర్షణ, అన్వేషణ మరింత పెరిగింది. ఆచరణలో వర్గపోరాటానికీ, సాంఘిక పోరాటాలకూ సంబంధించిన సమస్యలతోపాటు మార్క్సిజానికీ, అస్తిత్వవాదాలకూ సంబంధించిన సంఘర్షణ కూడా పెరిగింది.

                     దీనివల్ల చాలా మార్పులకు లోనైన మన ఉద్యమం ఆవరణలో విరసం మార్కిస్టు - లెనినిస్టు వైఖరితో అనేక స్థాయిల్లో తన ఆలోచనలు పంచుకున్నది. సంవాదంలో పాల్గొన్నది. అన్వేషణలో పాలు పంచుకున్నది.  అన్నివైపులనుంచి జరిగిన ఈ పని ఇంకా ముందుకు తీసుకపోవలసి వున్నది. సాహిత్య కళా రంగాల్లోనైనా, ఉద్యమాల్లోనైనా ఈ విషయం నిగ్గుతేలడానికి చారిత్రక భౌతిక వాదమే శాస్త్రీయ సామాజిక సిద్ధాంతమని విరసం దృఢ విశ్వాసం. అందుకే మరోసారి అస్తిత్వాల గురించి, వాటికి సంబంధించిన సాహిత్యం గురించి విరసం చర్చించ దలిచింది.  

 - విప్లవ రచయితల సంఘం
ఆంధ్రప్రదేశ్ 




కామెంట్‌లు లేవు: