...

...

15, ఏప్రిల్ 2018, ఆదివారం

"రైలుకథలు" పుస్తకావిష్కరణ సభ విశేషాలు!

టోరీ రెడియోలో రైలుకథలు పుస్తక పరిచయం!

టోరీ రెడియోలో 14-4-2018 శనివారం టోరి ఓ తెలుగమ్మాయి ప్రోగ్రాంలో రైలుకథలు పుస్తకాన్ని గురించి చర్చ జరిగింది. దానిని వినదలచినవారు ఈ క్రింది లంకెను నొక్కండి.

Telugu Radio 24/7 live radio ( TORI) | Telugu Radio | Online Radio | LIVE Music | Radio Music India OnLine

11, జనవరి 2018, గురువారం

వదరుఁబోతు

వదరుఁబోతు పుస్తకం పై నా సమీక్ష గ్రంథాలయ సర్వస్వం పత్రిక జనవరి 2018 సంచికలో ప్రచురింపబడింది. "వదరుఁబోతు"కు వందేళ్ళు
- కోడీహళ్లి మురళీమోహన్
ఇరవయ్యవ శతాబ్దపు రెండవ దశకం చివరలో అనంతపురం నుండి  యువకులు కొందరు వదరుఁబోతు అనే పేరుతో కరపత్రాల రూపంలో కొన్ని అమూల్యమైన వ్యాసాలను అందించారు. వ్యాసాలలో లభ్యమైన 22 వ్యాసాలను 1932లో సాధన ముద్రణాలయం పక్షాన పప్పూరు రామాచార్యులు ప్రకటించారు. తరువాత 1935లో రెండవ ముద్రణ పొందింది. 1986లో పప్పూరు రామాచార్యుల కుమారుడు పప్పూరు శేషాచార్యుల ఆధ్వర్యంలో మూడవ ముద్రణ వెలుగు చూసింది.   వ్యాసాలు వెలువడి వంద సంవత్సరాలు పూర్తయిన  సందర్భంగా వేమన అధ్యయన అభివృద్ధి కేంద్రం తరఫున డా|| అప్పిరెడ్డి హరినాథరెడ్డి   పుస్తకాన్ని ప్రస్తుతం పునర్ముద్రించి పాఠకలోకానికి అందిస్తున్నారు.  మొదటి రెండు ముద్రణలలోని విషయాలకు అదనంగా పుస్తకంలో ఆదోని పురాణసంఘం వ్యాసాలు మూడు, పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి సాక్షి వ్యాసము ఒకటి, టాట్లర్ మరియు స్పెక్టేటర్ వ్యాసాలకు సంబంధించిన చిత్రాలు, వదరుఁబోతు మొదటి రెండు ముద్రణల ముఖచిత్రాలు మొదలైనవి అనుబంధంలో చేర్చారు.

            వదరుఁబోతు వ్యాసాలను వ్రాయడానికి ఈ వ్యాసకర్తలకు  ప్రేరణనిచ్చింది 1709-11 మధ్యలో రిచర్డ్ స్టీల్ వ్రాసిన టాట్లర్ అనే వ్యాస సంచయము. వ్యాసకర్తలు విద్యార్థులు, ఉద్యోగులు కావడంతో బహిరంగంగా మాట్లాడేందుకు అవకాశం లేక, ఒక వేళ ఉన్నా కీర్తికాంక్ష కోరుకోక మఱుగున ఉంటూ లోకహితార్థమై హృదయాంతరాళంలో కలిగే భావోద్వేగాలను రాతల రూపంలో వదరుతూ ఆత్మసంతృప్తికై వ్యాసాలను వ్రాశామని తెలుపుకొన్నారు వ్యాసకర్తలు తమ పేర్లను ప్రకటించకపోయినా వ్యాసాలలోని సంకేతాక్షరాల ద్వారా వారి సంఖ్య ఆరు అని తేలింది. వారిలో పప్పూరు రామాచార్యులు, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, కర్నమడకల గోపాలకృష్ణమాచార్యులు, కర్నమడకల రామకృష్ణమాచార్యులున్నారని తరువాతి పరిశోధనలు అంచనా వేస్తున్నాయి వ్యాసాలు సుమారు 55 వెలువడ్డాయి. వ్యాసాలలో లోకపరిశీలన, అనుభవం, పరోపకార గుణం, విలువలతో కూడిన విద్య, కళాశాలల ఆవశ్యకత, దేశాభ్యుదయం, స్వదేశీవస్తూత్పత్తి, మూఢవిశ్వాసాల నిరసన, కీర్తికండూతి, ఆడంబరం, పరాయి సంస్కృతి, అనవసరధన వ్యయం ఇత్యాదుల వ్యతిరేకత, సత్యసంధత, కవిత్వ తత్త్వం, నాటక తత్త్వం, తెలుగు సంస్కృత సాహిత్యాల వికాసం , ఆధ్యాత్మికం, హాస్యం, వ్యంగ్యం,  తదితర అంశాలు కానవస్తాయి.

ఈ వ్యాసాలలోని భాష సరళ వ్యావహరికంలో ఉంది. భావంలోను, భాషలోనూ పరమ గ్రాంథిక వాతావరణం నెలకొన్న రోజులలో ఆధునిక భావాలను, భాషను తమ వ్యాసాలలో చొప్పించారు. ఈ వ్యాసాలలో సందర్భానుసారంగా తెలుగు, ఆంగ్ల సూక్తులు, సామెతలు, లోకోక్తులు, ఉపకథలు, పద్య పంక్తులు, జానపద గేయాలు ఉపయోగించారు. వేమన పద్యాలు మొదలుకొని కూనలమ్మ పదాల దాకా, వాల్మీకి మొదలుకొని ఎడిసన్ దాకా, శిబి చక్రవర్తిని మొదలుకొని సదయుని ఉదంతం దాకా ఈ వ్యాసాలలో మనకు కనిపిస్తాయి. ఈ వ్యాసాలు ఉత్తమ పురుషలో, ఆత్మస్వగతంగా చెబుతున్నట్లు సందేశాత్మకంగా కొనసాగాయి.

ఈ వ్యాసాలు లిఖించబడి నూరేళ్ళు గడిచినా ప్రస్తుత పరిస్థితులకు కూడా వీటి ఆవశ్యకత ఎంతో వుందని భావించి ఈ పుస్తకం పునర్ముద్రణ చేయడం ద్వారా హరినాథరెడ్డి తెలుగు సమాజానికి ఎంతో మేలు చేశారు.  ఈ పుస్తకం ప్రతి విద్యార్థి, యువకుడు, సాహిత్యాభిలాషి తప్పక చదవాలి. ఈ పుస్తకం చదివిన ప్రతి పాఠకుడు ఉత్తేజం పొందగలరు అనడంలో సందేహం లేదు. అయితే ఈ పుస్తకం పునర్ముద్రణలో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ప్రూఫులు చూడడంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సింది. ఉదాహరణకు హాస్యకళ అనే వ్యాసం (50వ పేజీ)లో 'చూచితిరా! దేహము బంగారు వన్నె; కన్నులు విశాలములు; ఎత్తయిన నాసిక; రోమరహితమైన యంగములు! ఇట్టి సౌందర్యవతిని బడయుటకు భర్త యెంతో పుణ్యము చేసియుండవలయును. నిజమే, కాని సీతకు (మన వలె కుఱుచగనో గొప్పగనో తోఁక యొకటి యున్న) నెంత బాగుగా నుండి యుండును!' పై వాక్యాలలో బ్రాకెట్లలో ఉన్న భాగం ఎగిరి పోయింది. ఆ భాగం వుంటే పాఠకులు మరింత హాస్యాన్ని ఆస్వాదించే వీలుండేది.   ఇలాంటి పొరబాట్లు తరువాతి ముద్రణలో సవరించుకోగలరని ఆశిస్తున్నాను.

 


14, అక్టోబర్ 2017, శనివారం

ఎర్రని ఆకాశం

ఇది ఒక అరుదైన పుస్తకం. సాధారణంగా ఎవరూ స్పృశించటానికి సాహసించని అంశాలలో ఒకటైన వేశ్యలకు సంబంధించిన విషయాన్ని తీసుకుని ఇటు భారతీయ సాహిత్యంలోను, అటు పాశ్చాత్య సాహిత్యంలోను ఆ అంశానికి సంబంధించిన ప్రస్తావనల గురించి విస్తారంగా చర్చించిన రచన ఇది. రచయిత డా. పి. రమేష్ నారాయణ ఎరుపు వేశ్యావృత్తికి, ఆకాశం విషయ వ్యాప్తికి సంకేతాలుగా స్వీకరించి ఈ పుస్తకానికి ఎర్రని ఆకాశం అనే పేరు పెట్టడం ఔచిత్యంగా ఉంది.
ఆర్ష భారతీయ సంస్కృతికి మూలాలైన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వైదిక సాహిత్యంలో ముఖ్యమైన ఆపస్తంబన సూత్రాలు, యాజ్ఞవల్క్య స్మృతి, సంవర్త, శంఖ, మనుస్మృతులు, బోధాయన ధర్మశాస్త్రం, మహా భారత, భాగవత, రామాయణాది మహా కావ్యాలలో వివాహేతర సంబంధాలు, లైంగిక సంబంధాలు, స్త్రీపురుషుల కామవికారాలు, బహుభార్యాత్వం, వేశ్యాధోరణులకు ఈ పుస్తకంలో ఉదాహరణలు లభిస్తాయి.
ఈ సమీక్ష పూర్తిభాగం ఈ క్రింది లంకెలో చదవండి.

12, జూన్ 2017, సోమవారం

నారాయణ స్మృతి

నేను హైదరాబాదుకు 1987 చివరలో వచ్చాను. మధ్యలో ఉద్యోగార్థం బయట గడిపిన ఐదారేళ్ళు మినహాయిస్తే ఈ పాతికేళ్ళ నా హైదరాబాదు జీవితంలో డా.సి.నారాయణరెడ్డిని కొన్ని వందల సార్లు చూసి ఉంటాను. అది రవీంద్రభారతి అయినా, ఆంధ్ర సారస్వత పరిషత్తు అయినా, శ్రీకృష్ణదేవరాయాంద్రభాషా నిలయమైనా, త్యాగరాయ గానసభ అయినా, సిటీ సెంట్రల్ లైబ్రరీ అయినా, మహాసభ అయినా, చిన్న సభ అయినా ఆయనను అనేక సందర్భాలలో చాలా దగ్గరగా, దూరంగా చూశాను. ఆయన ఉపన్యాసం విన్నాను. చతురోక్తులు ఆస్వాదించాను. అయితే ఆ పెద్దాయనను పలకరించిన పాపాన పోలేదు. నేను రావూరి భరద్వాజతో మాట్లాడాను, మునిపల్లె రాజుతో ముచ్చటించాను, పోతుకూచి సాంబశివరావును పలకరించాను, అద్దేపల్లి రామమోహనరావుతో ఆప్యాయంగా మాట్లాడాను కానీ సినారెతో మాటలు కలపలేకపోయాను. కారణం మరేమీ కాదు బిడియమే. ఇలా పరిచయం చేసుకునే అవకాశం వుండీ పలకరించని వాళ్ళ జాబితా చాలానే వుందనుకొండి.   ఒకసారి సారస్వత పరిషత్ హాల్లో నా కథాజగత్తో, విద్వాన్ విశ్వమో పుస్తకం ఆయనకు ఇచ్చాను. దాన్ని ఆయన చదివారో లేదో తెలియదు. అభిప్రాయం ఏమీ వ్రాయలేదు. నేనూ ఆశించలేదు. మరో సారి మిత్రుడు ఎస్.డి.వి.అజీజ్ తో కలిసి ఆయన ఛేంబర్‌లో బుడ్డా వెంగళరెడ్డి పుస్తకం ఇచ్చి (దాని పబ్లిషర్ నేనే) ఒక అరగంటో గంటో ముఖాముఖీ గడిపాము. అప్పుడు కూడా వారితో మాట్లాడలేక పోయాను. వారితో కలిసి ఫొటో దిగాలన్న కోరికా కలగలేదు, అవకాశమూ దక్కలేదు. ఇప్పుడు ఎన్ననుకుంటే ఏం లాభం? మా యిద్దరి మధ్యనున్న అనుబంధం మాటలకతీతమైనది కాబట్టే మాట్లాడుకోలేక  పోయామేమో? అలా సరిపెట్టుకోవాలి ప్రస్తుతానికి.         

31, మే 2017, బుధవారం

అనంతపురం జిల్లా గ్రామాల పేర్లు - పాలకుల ప్రభావము

    ఇది కొత్తగా నేను పరిశోధించి వ్రాస్తున్నదేమీ కాదు. ఇదివరకే అనంతపురం జిల్లా గ్రామాల పేర్లు పుట్టుపూర్వోత్తరాల గురించి చిలుకూరి నారాయణరావు, ఆదవాని హనుమంతప్ప, సర్దేశాయి తిరుమలరావు మొదలైనవారు శ్రీసాధనపత్రిక, భారతి  మొదలైన వాటిలో వ్యాసాలు వ్రాశారు. చర్చలు చేశారు. ఇది వాటి పునశ్చరణ మాత్రమే.   గ్రామాల  పేర్ల వ్యుత్పత్తి తెలుసుకొంటే అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అయితే వ్యాసంలో అనంతపురం జిల్లాను పరిపాలించిన ప్రభువులు వారి పరివారం పేరు మీదుగా ఏర్పడిన వూర్ల పేర్లకు మాత్రమే పరిమితమవుతున్నాను.    

      క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండే ఈ ప్రాంతంలో జనావాసాలున్నట్లు ఎర్రగుడి అశోకుని శాసనాలవల్ల తెలుస్తున్నది. అశోకుని కాలం నుండి క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నోలంబుల వరకు ఇక్కడి చరిత్ర లభించడం లేదు. నోలంబుల తరువాత గాంగులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ గాంగుల పేరుమీద గంగలకుంట, గంగంపల్లి, గంగాదేవిపల్లి, గంగినేపల్లి మొదలైన గ్రామాలున్నాయి.  గాంగ వంశీకుడైన మారసింహుని  పేరుతో మరూరు, మరుట్ల మొదలైన గ్రామాలు వెలిసాయి.

    గాంగుల తర్వాత ఈ ప్రాంతాన్ని చోళులు పరిపాలించారు. చోళసముద్రం, చోళేమర్రి, చౌళూరు మొదలైన ఊర్ల పేర్లు చోళ రాజుల వల్ల ఏర్పడినవి. తరువాత పడమటి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. గుత్తికోటను 6వ విక్రమాదిత్యుడైన త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు క్రీ.శ.1076-1126ల మధ్య పరిపాలించినట్లు శాసనాలు వెల్లడిస్తున్నాయి. ఇతని పేరుమీద మల్లాపురము, మల్లాగుండ్ల, మల్లాకాల్వ, మల్లాపల్లి, మల్లేనిపల్లి, మల్లేపల్లి మొదలైన గ్రామాలు వెలిసాయి.  తరువాత 12వ శతాబ్దంలో హొయసలులు గుత్తి పరిసర ప్రాంతాలను ఏలారు. గుత్తిని జయించిన వీరబళ్ళాలుని(1191-1253) పేరిట వీరాపురము ఏర్పడింది. తరువాత రాజులు యాదవులు. యాదవరాజైన సింగన్న (1210-1247) పేరుమీద శింగనమల, శింగవరము , యెఱ్ఱశింగేపల్లి మొదలైన గ్రామాలున్నాయి.

    ఆ తర్వాత ఈ ప్రాంతం ఓరుగల్లు కాకతీయుల ఏలుబడిలో కొంతకాలముంది. రాణీ రుద్రమ్మ పేరుతో రుద్రంపేట ఈ జిల్లాలో ఉంది. ఆ తర్వాత మహమ్మదీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. పిమ్మట ఈ నేల విజయనగర రాజుల వశమయ్యింది. బుక్కరాయల పేరిట బుక్కపట్టణం, బుక్కాపురం, బుక్కరాయసముద్రం అనే  ఊళ్లు వెలసినాయి.

      బుక్కరాయల మంత్రి పేరు అనంతరుసు. ఇతని పేరుమీద ఈ జిల్లా ముఖ్య పట్టణము అనంతపురంతో పాటు అదే పేరు గల మరో రెండు ఊళ్లు (మడకశిర, గుత్తి సమీపంలో), రాళ్ళ అనంతపురం అనే మరో ఊరు ఉన్నాయి.  జిల్లా ముఖ్యపట్టణమైన అనంతపురం మొదటి పేరు అనంతసాగరం అదే క్రమేణా అనంతపురంగా మారింది. బుక్కరాయలకు అనంతమ్మ అనే భార్య ఉన్నట్లు ఆమె పేరుమీద అనంతసాగరమేర్పడినట్లు ఒక వాదన ఉంది. కానీ పరిశోధకుడు చిలుకూరి నారాయణరావు బుక్కరాయల భార్యపేరు దేమాంబ అని నిర్ధారించినారు. బుక్కరాయని కొడుకు వీరవిరుపణ్ణ పెనుకొండ సామంతరాజుగా ఉన్నాడు. అతని పేరుమీద విరుపాపురము ఉంది.  ప్రౌఢదేవరాయపురం (ఈనాటి వేములపాడు), దేవరాయపురం (నేడు కల్లూరుగా పిలువబడుతున్నది) ప్రౌఢదేవరాయని పేరుమీద వెలువడిన గ్రామాలు.

     కృష్ణదేవరాయలకు ముందు పాలించిన నరసనాయకుని పేరిట ఈ జిల్లాలో నాలుగు నరసాపురములున్నాయి. ఇక కృష్ణదేవరాయల పేరుతో రెండు కృష్ణాపురములు, క్రిష్టిపాడు మొదలైన గ్రామాలున్నాయి. కృష్ణదేవరాయల కాలమునాటి బంగారు తిమ్మరాజు పేరిట నాలుగు తిమ్మాపురములున్నాయి. సదాశివరాయని ప్రతినిధి అయిన రామరాజు పేరిట రామగిరి, రామరాజుపల్లి, మూడు రాంపురములు  ఏర్పడ్డాయి. తిరుమలదేవరాయని పేరుతో తిరుమలదేవరాయపురం వెలిసింది.

       ఆరవీడు వంశపు రాణులపేరుతో వెంకటాంపల్లి, వెంగలమ్మ చెఱువు, నాగసముద్రం అనే గ్రామాలు ఉన్నాయి. ఆరవీడు పేరుతో ఒక గ్రామం తాడిపత్రి సమీపంలో ఉంది.  శ్రీరంగరాజు పేరుతో శ్రీరంగాపురమున్నది. వెంకటరాయలు పేరుతో వెంకటరాయనిపల్లి, వెంకటాపురము గ్రామాలున్నాయి. కొందరు సేనాధిపతులు ఇతర పాలెగాళ్ళ  పేరుతో దానాయని చెఱువు, నాగినాయని చెఱువు, జగరాజుపల్లి, మల్లారెడ్డిపల్లి, కోనేటినాయని పాళ్యం, తిమ్మానాయనిపాళ్యం, మద్దినాయని పాళ్యం మొదలైన ఊళ్ళు వెలిశాయి.   వీరిలో కోనేటినాయుడు అనే పాలెగాడు ప్రసిద్ధుడు.

   ఆరవీటి వంశపతనము తరువాత ఈ జిల్లాపై మహారాష్ట్రులు, మహ్మదీయులు దండెత్తినారు. మహరాష్ట్రీయుడైన మురారిరావు తన తండ్రి హిందూరావు పేరుతో హిందూపురంను నెలకొల్పాడు. అక్కజాంపల్లి, అప్పాజిపేట, లోకోజిపల్లి, విఠాపల్లి మొదలైన గ్రామాలు మహరాష్ట్రీయుల ఏలుబడికి గుర్తులు.  మహమ్మదీయ పాలకుల పేరు మీద అమీన్ పల్లి, ఖాదరుపేట, షేక్ సాని పల్లి, సతార్లపల్లి, సైదాపురము, హుసేన్ పురము, ఆలంపురము, కరీంరెడ్డి పల్లి మొదలైన గ్రామాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఇక పాలెగార్ల పేరు మీద సిద్ధాపురము, సిద్ధరాంపురము, సిద్ధరాశ్చెర్ల, ప్రసన్నేపల్లి, బసాపురము మొదలైన గ్రామాలున్నాయి.

       పైన పేర్కొన్న గ్రామ నామధేయాల వ్యుత్పత్తి ఆయా పాలకుల/వ్యక్తుల పేరుమీద వెలువడినట్లు చారిత్రక ఆధారాలు పెక్కింటికి ఉంటే మిగిలిన వాటి సంభావ్యతను చారిత్రకులు ఊహించినారు. అలా ఊహించడానికి ఆయా గ్రామాల సాంఘిక, సాంస్కృతిక, చారిత్రక పరిస్థితులు కొంత కారణం కావచ్చును.  

9, మార్చి 2016, బుధవారం

సత్యశోధన మణిమాలలో వజ్రపతకం

ప్రజాసాహితి మార్చి 2016 సంచికలో మొదటితరం రాయలసీమ కథలు పుస్తకం పై వి.ప్రతిమగారి సమీక్ష !